
ఊహాగానాలు, రూమర్లపై కథనాలపై గరం
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై ఉహాగానాలు, రూమర్లపై మీడియా కథనాలు వెల్లడించడంపై రాంగోపాల్ వర్మ తప్పుపట్టారు. ఈ కేసు విచారణ విషయంలో మీడియా వ్యవరిస్తున్న తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సుశాంత్ కేసులో మీడియా చేస్తున్న దర్యాప్తు సరికాదు అంటూ సీబీఐ విచారణపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

రియా చక్రవర్తిని మంత్రగత్తెలా వేటాడటంపై
సుశాంత్ మరణం తర్వాత రియా చక్రవర్తిని ఓ మంత్రగత్తెను వెంటాడినట్టు మీడియా తరుముతున్నది. గ్రామాల్లో మంత్రెగత్తెలను తరిమే విషయాన్ని గతంలో చూశాం. ప్రస్తుతం అలాంటి పరిస్థితే మీడియాలో ప్రస్తుతం కనిపిస్తున్నది. రియా చక్రవర్తి తప్పు చేసిందా? లేదా అనే విషయాన్ని ఎవరు పట్టించుకోవడం లేదు అని రాంగోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మీడియా అత్యుత్సాహం అంటూ
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసును సీబీఐ చేపట్టిన తర్వాత మీడియాలో అత్యుత్సాహం ఎక్కువగా కనిపిస్తున్నది. ఆమెను ఓ మంత్రగత్తె మాదిరిగా వెంటాడుతున్నారు. అంతేగాకుండా హంతకురాలు అనే ముద్రను మీడియా వేస్తున్నది అని రాంగోపాల్ వర్మ అన్నారు. ప్రధాన టెలివిజన్ ఛానెల్స్ ఇలా వ్యవహరించడం ఆందోళన కలిగిస్తున్నదన్నారు.

మీడియానే హత్య అంటూ కథనాలు
సుశాంత్ కేసు విషయంలో ఎలాంటి రుజువులు లేకుండా మీడియా ఆ ఘటనను హత్యగా చిత్రీకరిస్తున్నది. ఒకవేళ పోలీసులు ఆ విషయాన్ని హత్యగా పరిగణిస్తే.. బాధ్యతాయుతమైన మీడియా కూడా దానిని హత్య జరిగి ఉండవచ్చనే కోణంలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ సుశాంత్ విషయంలో పోలీసులు సూసైడ్ అంటే.. అర్నబ్ గోస్వామి లాంటి వ్యక్తులు తమ ఛానెల్లో నేరుగా మర్డర్ అని చెప్పడం ఆశ్చర్యంగా ఉంది అని రాంగోపాల్ వర్మ వీడియోలో అన్నారు.

బాలీవుడ్ ప్రముఖుల మౌనంపై మండిపడ్డ వర్మ
సుశాంత్ మరణానికి సంబంధించిన కేసు వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంటే బాలీవుడ్ ప్రముఖులు ఎవరూ కూడా నోరు విప్పకపోవడంపై రాంగోపాల్ వర్మ అసహనం వ్యక్తం చేశారు. ఓ ఒక్కరు కూడా నోరు విప్పడం లేదు. అలా ఎందుకు భయపడుతున్నారో అర్ధం కావడం లేదు. నేను ఏదైనా మాట్లాడితే నాకు ప్రైవేట్‌గా మెసేజ్ చేసి అభినందిస్తున్నారు. అదే మీరంతా ఎందుకు బహిరంగంగా మాట్లాడటం లేదు అని వర్మ ప్రశ్నించారు.